పరస్పర సహకారంతో సీఎఫ్ఎంఎస్ లో సమస్యలను పరిష్కరించుకోవాలి!: ఏపీ సీఎస్ దినేష్
- సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థపై సీఎస్ సమీక్ష
- పెండింగ్ బిల్లులను త్వరలో పరిష్కరిస్తాం
- ఈ నెల 24 నాటికి అన్ని శాఖల వారు డేటా అప్ లోడ్ చేయాలి
ఆర్థిక శాఖ, ఇతర శాఖల పరస్పర సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సూచించారు. సచివాలయం 5 బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు, ప్రాథమికంగా తలెత్తే సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కొన్ని శాఖలలో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలో పరిష్కరిస్తారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నాటికి అన్ని శాఖల వారు డేటాను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.
ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టిన ఈ నూతన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు 90 శాతం డేటా అప్ లోడ్ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ వల్ల ఉపయోగాలు, డేటాకు రక్షణ, నిర్వహణ సౌలభ్య, డేటా అప్ లోడ్, వివిధ మాడ్యుల్స్, బిల్లుల చెల్లింపు మొదలైన అంశాలను వివరించారు. ప్రభుత్వంలోని 78 శాఖల బడ్జెట్, లావాదేవీలు, వివిధ పథకాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు, 4,22,972 మంది ఉద్యోగులు, 3,55,618 మంది పెన్షనర్లకు సంబంధించిన లావాదేవీలు జాప్యం లేకుండా జరగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డేటా అప్ లోడ్, బిల్లుల చెల్లింపులు, యూజర్ నేమ్, పాస్ వర్డ్ వంటి సమస్యలతోపాటు శాఖాధిపతులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆర్థిక శాఖ అధికారులు సమాధానాలు చెప్పారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. సచివాలయంలోని ఒక్కో బ్లాక్ కు ఒక్కో సీఎఫ్ఎంఎస్ సెల్ ఏర్పాటు చేయమని అడుగగా, అందుకు సీఎస్ అంగీకరించారు. 